రంజాను శుభాల వెలుగులో ఇస్లాం పరిచయం

ప్రియమైన సోదర సోదరీమణులారా!

రంజాను మాసం విచ్చేసింది, ఈ మాసపు శుభాలను, ప్రాముఖ్యతను మీతో పంచుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. రంజాను అనేది చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ క్యాలండరులో పన్నెండు నెలలలోని తొమ్మిదవ నెల. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిములందరూ కూడా ఈ నెలలో ఉపవాసాలు ఉంటారు. ఉపవాస సమయంలో అంటే ప్రాత: కాలం నుండి చీకటిపడే వరకు అన్న-పానీయాలకు, లైంగిక వాంఛలకూ దూరంగా ఉంటారు. ఇలా కేవలం శారీరకపరంగానే కాకుండా మానసికంగా కూడా చెడు వాంఛలు, తలంపులకు దూరంగా ఉండి ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచుకోవడం ఈ ఉపవాసంలోని ముఖ్య విషయం. పరోక్ష నింద చెయ్యకుండటం, చాడీలు చెప్పకుండటం (నాలుకపై నిగ్రహం); అశ్లీల దృశ్యాలను చూడకుండటం (కళ్లపై నిగ్రహం); చెడు విషయాలు, వ్యర్ధ ప్రేలాపనలు వినకుండటం (చెవులపై నిగ్రహం); చేతులతో ఎటువంటి చెడు కార్యాలు చేయకుండడం, కాళ్లతో చెడు పాపాలు జరిగే ప్రాంతాలకు వెళ్ళకుండటం (అవయవాలపై నిగ్రహం) ఇవన్నీ కూడా ఉపవాసంలో భాగాలే. అంటే శరీరం మొత్తం కూడా ఉపవాస దీక్షలో పాలు పంచుకునేలా చేసి, తద్వారా ఆచరణలోనే కాక ఆలోచనలలో కూడా పవిత్రతను సాధించడం ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) గారు ఇలా సెలవిచ్చారు – “ఉపవాస సమయంలో వ్యర్ధ ప్రేలాపనలు, చెడు పనుల నుండి దూరంగా ఉండని వ్యక్తి యొక్క అన్న పానీయాలను త్యజించడం అనేది దేవుడికి ఏ మాత్రం అవసరం లేదు”

రంజాను ప్రాముఖ్యత ఏమిటి ?

సర్వ శక్తిమంతుడైన ఆ దైవం ఖుర్ఆన్ గ్రంధంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు

“ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!...  రంజాన్ నెల! అందులో దివ్య ఖుర్‌ఆన్‌ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యా సత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాసముండాలి....” 
[ఖుర్ఆన్ 2:183-185]

ఖుర్ఆన్ అవతరింపచేయబడిన నెల రంజాను నెల. ఈ నెలలో ఉపవాసం ఉండడం ద్వారా మనం ఆ దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి మరియు సహనశీలత, దైవ భీతి, ధర్మ నిష్టతలను పెంపొందించుకోవాలి. రంజాను పండుగ (ఈద్-ఉల్-ఫిత్ర్) వేడుకతో రంజాను మాసం ముగుస్తుంది. రంజాను పండుగ రోజున ప్రత్యేక సామూహిక ప్రార్ధనల ద్వారా దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోవడం, కుటుంబ సమేతంగా విందు భోజనాలు ఆరగించడం జరుగుతుంది. అయితే దీనికి ముందు ప్రతీ వ్యక్తి కూడా “జకాతుల్ ఫిత్ర్” అనబడే దానాన్ని చేసి పేదవారు పండుగ రోజున ఆకలితో ఉండకుండా చూసుకోవడం, వారు కూడా పండుగ సంబరాలలో పాలు పంచుకునేలా చూసుకోవడం తప్పనిసరి.

ఖుర్ఆన్ అనేది కేవలం ముస్లిముల గ్రంధమా ?

ఖుర్ఆన్ అనేది కేవలం ముస్లిముల గ్రంధమని చాలా మందిలో ఒక అపోహ ఉంది. కానీ ఖుర్ఆన్ మాత్రం తనను తాను సర్వ మానవాళికి మంచి-చెడులను స్పష్టపరిచే, మార్గదర్శకత్వం చేసే సందేశ గ్రంధంగా పరిచయం చేసుకుంటుంది.

దైవం తరపు నుండి మనకు మార్గదర్శకత్వం అవసరమా ?

మీకొక సందేహం కలుగవచ్చు… ఏది మంచి? ఏది చెడు? అనేది ఆ దైవం మనకు చెప్పవలసిన అవసరం ఉందా? మనకు అంత జ్ఞానం లేదా? అని. దీనిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నైతికమైన-న్యాయమైన సమాజంలో ప్రతీ వ్యక్తి కూడా కొన్ని నైతికపరమైన సిద్ధాంతాలకు లేదా సూత్రాలకు కట్టుబడి ఉండాలి. అయితే ఈ సిద్ధాంతాలు లేదా సూత్రాలు అనేవి అందరిచే ఆమోదించబడి, అంగీకరించబడి ఉండాలి. ఏది మంచి? ఏది చెడు?; ఏది నైతికం? ఏది అనైతికం?; ఏది తప్పు? ఏది ఒప్పు? అనేవి సమాజంలో నివసించే మనుషులు నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఏది మంచి? ఏది చెడు? అనే విషయంలో, ప్రతీ వ్యక్తి కూడా తన వ్యక్తిగతమైన అవగాహనను కలిగి ఉంటాడు. ఒకరికి మంచిగా అనిపించింది వేరొకరికి చెడుగా తోచవచ్చు. ఒకరికి నైతికంగా అనిపించింది వేరొకరికి అనైతికంగా కనబడవచ్చు. ఒకరు తప్పు అంటే వేరొకరు అది ఒప్పు అనవచ్చు.

ఉదాహరణకు

వావి-వరుసలు లేని సంగమాలు (Incest) చాలా దేశాలలో అసహ్యకరమైనవిగా, అసభ్యకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. అయితే అర్జెంటీనా, బెల్జియం, స్పెయిన్, హాలాండ్ మొదలైన దేశాలలో వీటికి చట్టపరమైన అనుమతి కూడా ఉంది. ఏది నైతికం? ఏది అనైతికం? అనేది వ్యక్తిగతమైనదని… అంటే కొందరికి అనైతికం అనిపించింది మరి కొందరికి నైతికం అనిపించవచ్చని దీని ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా నైతిక సూత్రాలను ఒక సామాన్యమైన ప్రమాణం అనేది లేకుండా కొందరు మనుషులే నిర్ణయించడం జరిగితే, భిన్నాభిప్రాయాల వలన అది వివాదాలకు-ఘర్షణలకు చివరకు అవినీతి-అరాచకత్వాలకు దారితీస్తుందని కూడా అర్ధం అవుతుంది. అంతే కాకుండా, మనుషులు శాసనాలు చేస్తే వాటిపై వారి పక్షపాత ధోరణి, సంకుచిత స్వభావం, స్వార్ధ ప్రయోజనాల ప్రభావం పడే ప్రమాదం కూడా ఎంతైనా ఉంది.. ఈ విధంగా మనుషులు మనుషులకు శాసనాలు సమర్ధవంతంగా చేయలేరని, దానికి బదులు మనిషి యొక్క మానసిక ప్రవృత్తి, ప్రవర్తనలు పూర్తిగా తెలిసిన ఒక వివేకవంతమైన అస్తిత్వం (దైవం) మాత్రమే అటువంటి శాసనాలను చేయగలదని మరియు సర్వ మానవాళి వాటికి కట్టుబడి ఉండడం అత్యంత శ్రేయస్కరమైన విధానం అని తార్కికంగా బోధపడుతుంది. ఒక వస్తువును ఉత్పత్తి చేసేవాడే ఆ వస్తువు గురించి సరి అయిన అవగాహనా జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అలాగే, మనుషులను సృష్టించిన ఆ దైవం తప్ప మరెవరు మనిషి స్వభావాన్ని సమగ్రంగా ఎరిగి ఉండగలరు? అందుకని ఆ దైవమే మనిషికి ఏది మంచి? ఏది చెడు? ఏది నైతికం? ఏది అనైతికం? అనేది సరిగ్గా ప్రతిపాదించగలడు. మనిషిని ఒక యంత్రంతో గనుక పోలిస్తే, ఈ భూమిపై ఉన్న అన్ని యంత్రాలకన్నా క్లిష్టమైన యంత్రం మనిషే అనవలసి వస్తుంది. ఏ యంత్రానికీ లేనటువంటి బుద్ధి-జ్ఞానాలతో పాటు కోప తాపాలు, ప్రేమానురాగాలు, సుఖదు:ఖానుభూతులు మొదలైన భావావేశాలను మనిషి కలిగి ఉన్నాడు. ఒక యంత్రాన్ని ఉపయోగించడం ఎలాగో తెలుసుకోవాలంటే మనకు దాని ఉత్పాదకుడి ద్వారా రచించబడిన సూచనల పుస్తకం (Manual) మరియు దానిని ఉపయోగించే తీరుపై ఒక ప్రదర్శన (Demo) అవసరం అవుతాయి. కారుని ఉపయోగించడం ఎలానో తెలుసుకోవాలంటే కారును ఉపయోగించి ప్రదర్శన ఇవ్వాలి గాని బైకుని ఉపయోగించి కాదు కదా? అలాగే, మనుషులలో సదాచారులు, సత్య సంధులైన వారిని ఆ దైవం ఇతర మనుషులకు ఒక ఆదర్శంగా నిలబెడతాడు. ధర్మ బద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలో ప్రదర్శించి చూపే ఆ సత్పురుషులే దైవ ప్రవక్తలు. ప్రవక్తలు కూడా మనుషులే, వారు ఎటువంటి దైవిక శక్తులను, అగోచర జ్ఞానాన్ని కలిగి ఉండరు. కొంత మంది ప్రవక్తల పేర్లు – నోహ్, అబ్రహం, డేవిడ్, మోసెస్, జీసస్ (వీరందరిపై శాంతి కలుగు గాక). ప్రవక్తలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు (మన దేశానికి కూడా) పంపబడ్డారు. ప్రవక్తలందరూ కూడా దైవ సందేశాన్ని, దైవానికి ఆమోదయోగ్యమైన జీవిత విధానాన్ని బోధించడానికే వచ్చారు. ప్రవక్తల పరంపరలో చిట్ట చివరిగా పంపబడిన వారు ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక). ప్రవక్తల ద్వారా మానవాళికి అందజేయబడిన సూచనల పుస్తకాలే దైవ గ్రంధాలు.

ఖుర్ఆన్ యొక్క విశిష్టత ఏమిటి ?

ఖుర్ఆన్ అంతిమ దైవ గ్రంధం. ముహమ్మద్ గారు ఈ గ్రంధానికి కర్త కారు. వాస్తవానికి ఆయన ఒక నిరక్షరాస్యుడు. ఖుర్ఆన్ దైవ దూత అయిన జిబ్రయీల్ ద్వారా ముహమ్మద్ ప్రవక్త వారికి అందజేయబడిన దైవ వాణి. అవతరించిన కాలం నుండి ఎటువంటి మార్పులకు లోనుకాకుండా, 1400 సంవత్సరాలు దైవం ద్వారానే పరిరక్షించబడిన గ్రంధం ఖుర్ఆన్.

“నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్)ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.” [ఖుర్ఆన్ 15:9]

ఖుర్ఆన్ ఏమి బోధిస్తుంది ?

ఖుర్ఆన్ ముఖ్యంగా 3 విషయాలను బోధిస్తుంది. అవి

1. మానవ జీవిత పరమార్థం

మానవ జీవిత పరమార్ధం కేవలం తన సృష్టికర్త ఆరాధన మరియు ఆజ్ఞాపాలన. సృష్టికర్తనే ఆరాధించాలి తప్ప సృష్టిలోని అంశాలయిన సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, నదులు, మనుషులు, జంతువులు, ప్రతిమలు, విగ్రహాలు మొదలైన వాటిని కాదు. సృష్టికర్త అస్తిత్వాన్ని నిరాకరించకూడదు, సృష్టితాలను సృష్తికర్త స్థాయికి ఎత్తకూడదు.

2. దేవుడి యొక్క గుణ గణాలు

A) దేవుడు ఒక్కడే, ఆయనకు సమానులెవరూ లేరు

B) దేవుడు నిరాపేక్షాపరుడు – తిండి, నిదుర, సంసారం, సంతానం మొదలైన అవసరాలకు అతీతుడు.

C) దేవుడు సర్వ శక్తిమంతుడు, సృష్టిరాసులకు ఉన్న బలహీనతలకు అతీతుడు. ఉదాహరణకు దేవుడు అలసిపోవడం,మరచిపోవడం లేదా తప్పులు చేయడం అనేది అసంభవం.

D) దేవుడు సర్వ మానవాళిని ప్రేమిస్తాడు. కులం, జాతి, రంగు, వంశానుగుణంగా ఎవరిమీదా కూడా పక్షపాత వైఖరిని కలిగి ఉండడు.

3. పరలోక జీవితం

ఒకానొక రోజు ఈ సృష్టి అంతం కానుంది. ఆది మానవుడి మొదలు ఈ భూమిపై నివసించిన చిట్టచివరి మానవుడి వరకు అందరినీ తిరిగి లేపడం జరుగుతుంది., దేవుడి ముందు నిలబెట్టి వారి కర్మలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది. కేవలం నిజ దైవాన్నే ఆరాధించి, సత్కార్యాలు చేసుకున్న వారికి అత్యుత్తమ ప్రతిఫలమైన స్వర్గం లభించనుంది మరియు దైవాన్ని తిరస్కరించిన వారికి భయంకరమైన నరక శిక్ష పడనుంది. స్వర్గ నరకాలలో జీవితం శాశ్వతం, ఎప్పటికీ అంతం కానిది.

ఖుర్ఆన్ దైవ వాణి అనడానికి ఆధారం ఏమిటి? మనం ఖుర్ఆన్ ను ఎందుకు విశ్వసించాలి ?

ఖుర్ఆన్ ప్రతీ ఒక్కరినీ ఆలోచించమని ప్రోత్సహిస్తుంది మరియు అందులో ఒక తప్పునైనా చూపించమని సవాలు విసురుతుంది. ఈ గ్రంధకర్త అయిన దేవుడు ఇలా అంటున్నాడు  – “ఏమీ? వారు ఖుర్‌ఆన్‌ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్‌ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చివుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా!”   [ఖుర్‌ఆన్‌ 4:82]

ఖుర్ఆన్ లో అనేక శాస్త్రాల ప్రస్తావన మనం చూడగలం. భూగర్భ శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సముద్ర విజ్ఞాన శాస్త్రం, న్యాయ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం.. ఇలా మొదలైన శాస్త్రాలకు సంబంధించిన అనేక విషయాలను మనం అందులో కనుగొనవచ్చు. 21వ శతాబ్దంలో జరిగిన ఆవిష్కరణల ద్వారా తెలుసుకున్న విషయాలు 1400 సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చిన ఒక గ్రంధంలో ఉండడం నిజంగా ఒక అద్భుత విషయం. ఇవి నిరక్షరాస్యుడు, ఎడారి వాసి అయిన ముహమ్మద్ గారికి తెలిసి ఉండడం అసంభవం. దీని ద్వారా కూడా ఖుర్ఆన్ దైవం తరపు నుండి వచ్చిందని మనం అర్ధం చేసుకోగలం.

ఖుర్ఆన్ ప్రత్యేకత ఏమిటి ?

ఖుర్ఆన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది మానవ సమాజం యొక్క సమస్యలకు సంబంధించిన మూల కారణాలను ప్రస్తావించి, వాటికి ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఆర్ధిక, వ్యాపార, న్యాయ, రాజకీయ, మనస్తత్వ, కుటుంబ, వారసత్వ మొదలైన మానవ జీవితానికి సంబంధించిన అన్ని రంగాలను అది స్పృశించి, వాటన్నింటి విషయంలోనూ మార్గదర్శకత్వం చేయడం దాని ప్రత్యేకత. ఖుర్ఆన్ సందేశం నిత్య నూతనమైనది మరియు సార్వజనీనమైనది. జాతి, ప్రాంత భేదాలకు అతీతంగా అందరికీ వర్తించేది.

తుది పలుకు

ప్రియమైన సోదర, సోదరీమణులారా! ఖుర్ఆన్ మన సృష్టికర్త నుండి సమస్త మానవాళి మార్గదర్శకత్వానికి అవతరించిన కారుణ్య వాణి. మనం ఏ జీవిత విధానాన్ని అవలంబిస్తున్నప్పటికీ కూడా ఒకే దైవం ద్వారా పోషించబడుతున్నాము. ఆ దైవం మనకు నిత్యం ప్రసాదిస్తున్న కరుణా కటాక్షాలు, అనుగ్రహాలు అసంఖ్యాకమైనవి. వీటన్నింటికీ గాను మనం మన సృష్టికర్తకు కృతజ్ఞత చూపడం అనేది మన కనీస కర్తవ్యం. అది ఎలా చేయాలో ఖుర్ఆన్ మనకు బోధిస్తుంది. జీవితం దైవ విధేయతతో ఎలా గడపాలో కూడా అది మనకు సూచిస్తుంది. తద్వారా ఇహ-పరలోక జీవితాలలో శాంతిని పొందే మార్గాన్ని అది మనకు చూపిస్తుంది. రంజాను మాసపు ఈ శుభ సందర్భంలో.. ఆ దైవాజ్ఞలను పాలిస్తూ, దైవ విధేయతతో జీవితం గడుపుతామని ప్రతిజ్ఞ చేద్దాం.

రమదాన్ మరియు ఖురాన్ గురించి మరింత తెలుసుకోవడానికి, మీ భాషలో ఖురాన్ అనువాద ప్రతిని ఉచితంగా పొందడానికి సంప్రదించండి

వాట్సాప్ లేదా కాల్ 98860 01357